Friday, July 12, 2013

విలయతాండవం



భక్తి నిండిన హృదయాలతో,
ముక్తి నొసగే ప్రకృతి వడిలో,
భుక్తిని మరచి కానలలో,
శక్తిని మరచి మైమరచి నగములలో.

హిమవంతుని వడిలో,
హిమపాతపు కౌగిట,
హితులకు దూరముగా,
హరుని పాద సేవకేగిరి భక్తజనుల్.

స్వర్గదామమైన హిమాలయాల అంచులపై, చల్లని గాలుల నడుమ, పచ్చని 
పచ్చికపట్టుల మద్య పయనించుచు, ఆనందముతో కూడిన మనస్సుతో ఉన్న ఆ వేల.


జటాదర జటాజూటమే హిమగిరి నగమైన,
అందు చుట్టబడిన గంగయే సరస్సయిన,
సడలిన జటలే కూలిన వంతెనయిన,
ఉప్పొంగిన గంగవలె ఆ సరస్సు లోయలో దుమికెన్‌....

నిర్లక్ష్యపు నిశీదిలో ఓ తప్పిదము,
పెను ప్రమాదమునకు కారణము,
సహజ వంతెనె అయ్యెను బలహీనము,
రక్షణ వలయమునకు ఇది ఛేదము.

దిక్కులు పెక్కుటిల్లే మెరుపుల గళం,
హోరున వీచే పవనుని తాళం,
జోరున కురిసే వర్షపు గాలం,
వెరసి హూంకరించెను ఆ ధరం.

ఉరకలు వేసిన గంగా తటాకం,
కట్టలు తెంచుకున్న హిమనీ నగం,
రాతి గుండ్ల ఆ ప్రవాహ
మడుగున పూడెను ఆ నగరం.

పారెను శిలల సెలయేరు,
జారెను పర్వత చెరియలు,
చెరిగెను రహదారులు,
చిక్కెను భక్తజనులా లోయలోన్‌.

మడుగున చిక్కిన జనులు,
చేతులు జారిన భందువులు,
నిదుర లేని కాలరాతృలు,
ఏరులై పారెను అసృవులు.

శవాల మద్యన మిగిలిన ప్రాణాలు,
సాయానికై వేచిన విషాద వదనాలు,
హితం మరచి దోచుకున్న రాబందులు,
సాయమందక రోదించిన దీనులు.

కుసుమాసితమై యుండే ఆ నగము,
ఆత్మలు రాలిన పీనుగులతో నిండెను.
భక్తులకు పునీతమైన ఆ శివాలయం,
నేడు శ్మశానముగ గోచరించెను.


ఈ ప్రళయాన్ని కనుగొన్న వెంబడే, శివగణాలు కదిలినట్లుగా వేగిరమై జవానులు ఆ చోటికి చేరి, వంతెన లేని చోట వంతెనై, దారి లేని చోట దారి చేసి, ఆకలిగొన్న ప్రాణులకు ఆకలి తీర్చి, జడిసిన మనసులకు దైర్యాన్నిచ్చి, అస్వస్తులకు వైద్యాన్నిచ్చి, జడివానను సైతం లెక్క చేయక ప్రాణాలను పనంగా పెట్టి ఆ మిగిలిన ప్రాణాలను కాపాడిరి. ఈ మహనీయులకు (జవానులకు) వందనం. జై హింద్...!!!

-- శంకర్