జీవితం గురు సంబందీకం. ప్రతి వ్యక్తి జీవితంలో ప్రతి అడుగులో గురువు యొక్క పాత్ర ఎంతో కొంత నిక్షిప్తమౌతుంది. జీవితం మొదలు మాత్రుమూర్తి, జీవిన అంతం స్నేహితులు, సహచరులు వరకు అందరు ఏదో ఒక సందర్భమున గురు స్తానం వహించి మన జీవితాన్ని ఒక సుగమమైన మార్గమున నడిపించిన వారే. ఐతే ఇంత ప్రత్యేక స్థానాన్ని వహించిన గురు స్థానాన్ని నేటి ఈ విద్యా సంస్థలు ఆవహించి వీటి విలువలను నాశనం చేస్తున్నాయి. ఇటువంటి విద్యాసంస్థలే ఈనాడు నా అంశం.
కాలం మారింది, విలువలు మారాయి,
నాడు గురువే దైవం, నేడు గురువే వర్తక సముదాయం,
నాడు గ్నానానికి పట్టం, నేడు పైసాకి దాసోహం,
నాడు విద్యార్థికి కళాశాల ఒక విద్యా భాండాగారం,
నేడు అదొక కార్మాగారం.
అర్హత:
ద్రోణాచార్యుడు దనుర్వేదాన్ని అవపోసన పట్టిన దిట్ట, భీష్ముడంతటి వారిచే శ్లాఘించబడిన మహా గురువు, కురుపాండవుల గురువు. ఇంతటి మహనీయుడు, బ్రహ్మాస్త్ర సంపన్నుడు, అర్హతను నిర్ణయించకుండా బ్రహ్మాస్త్రముతో సహా అన్ని విద్యలను అందరికి నేర్పించిన యెడల ఆనాడు దర్మము నిలిచుని ఉండేదా??.
ఏకలవ్యుడు ద్రోణుడి శిష్యుడు. ఆయన గురువుని మించిన శిష్యుడు, అర్జునుని మించిన విలుకాడు. అటువంటి దక్షత కలిగిన శిష్యుని ముని వ్రేళుని దక్షినగా కోరి తాను నేర్చిన విద్య తనకు అక్కరకు రాకుండా చేయడం గురువుగా ద్రోణుడు చేయడం సబబా?? అవును సబబే. ఒకనాడు గురు సమేతంగా కురు-పాండవులు అడవికి వెళ్ళిననాడు ఒక సన్నివేశం ద్రోణుని కంటపడినది, అది ఏమనగా, ఒక జాగిలము(కుక్క) తన వైపు చూసి అరిచిందని క్షనికావేశంలో, చీ..!!! అంటే వినుదిరిగే కుక్కని అది నోరు తెరిచి మూసేలోగా ఏడు బాణాలు దాని నోట్లోకి కొట్టి ఏకలవ్యుడు తన బలాన్ని ప్రదర్శించాడు. చీపురి పుళ్ళను విరవడానికి గొడ్డలిని ఉపయోగించినట్లు, క్షణికావేశంలో బలాబల విచక్షన లేక బలముంది కదా అని దాన్ని ప్రయోగించే వాని చెంత ఇంతటి అస్త్ర విద్య ఉంటే అది ఏదోఒకనాడు బలహీనులను చనకగలదు. కావున ద్రోణుడు ఏకలవ్యుని అర్హతను ద్రుష్టియందుంచుకొని ఆ గురుదక్షిన కోరాడు. ఇక్కడ గురువు శిష్యుని అర్హతను ఎంచడం ఎంత విలువైన కార్యంగా మన పూర్వికులు ఎంచారో అర్ధమవుతుంది.
మరి నేడు ఈ అర్హత అను దాన్ని మన కళాశాలలు పట్టించుకుంటున్నారా?? కొంత వరకు మార్కులతో అర్హతను నిర్ణయించడం సబబుగానే అనిపించినా అది ఎంత వరకు కార్యాచరణలో ఉంది అని ఆలోచిస్తే ఇది సరిపోదు అని అర్దమౌతుంది. డబ్బుకి దాసోహం అంటూ కళాశాలలు ప్రవర్తిస్తున్న తీరు దక్షతలేని ఇంజినీర్లను, మానవత్వం లేని డాక్టర్లను, కార్యాచరణలో నిభద్దత లేని ఉద్యోగులను తయారు చేస్తుంది.
శిక్షణ:
తాను నేర్చిన విద్య తన యందే ప్రకాశించి తన యందే నశించిపోవడం పాపంగా భావించేవారు ఆనాడు. అందుకే తన విద్యను ప్రతిభావంతులైన విద్యార్దులకు పంచడంలో ఎల్లప్పుడూ ఆశక్తి కనబరిచేవారు. మరి కళాశాలలు ఒక వర్తకంగా మారిన నేడు, డబ్బుపై ఆశక్తితో కాకుండా విద్యను పంచడంపై ఆశక్తి కనబరిచేవారు తక్కువైపోయారు. ఈ వర్తక దోరణిలో పడి ఎంతో విలువైన మన వేద సంపదను సమాదుల్లోకి చేర్చారు. శిక్షణా పద్దతులను మార్చి పోటీతత్వాన్ని పెంచామని దానితో పురోగతిని సాదించామని భావించి, లేత మనస్సులపై ఒత్తిడిని పెంచి చదువునే వారి పాలిట యమపాశంగా మార్చి ఎన్నో చిరు హ్రుదయాలను నిశీదిలో కలిపేశారు.
పరీక్ష:
మన చిన్ననాడు, కూడికలు నేర్చుకొనే సమయమున ఉపాద్యాయులు వారికి తోచిన అంకెలను కూడమని పరీక్ష పెట్టేవారు. కావున మనం ఎలాంటి సంక్యలనైన నేడు కూడ గలుగుతున్నాం. మరి తరగతులు పెరిగే కొద్ది ఏం జరుగుతోంది?? ప్రశ్నలలో క్లిష్టత పెరుగుతుంది, దీనితో ప్రశ్నలను తయారు చేయడంలో క్లిష్టత పెరిగింది. ఆ క్లిష్టతను సమస్యగా భావించి కొత్త ప్రశ్నలను పరీక్షలకు ఇవ్వడం మానేసి ఒకే ప్రశ్నను ఇవ్వడం అలవాటు చేశారు. దీనితో విద్యార్దికి తెలిసిన సమాదానమే అవటంతో ఆలోచించాల్సిన అవసరం లేకుండా పోయింది.
"చేపకి కోతికి చెట్టెక్కడమ్లో పోటీపెడితే ఏనాటికి చేప గెలవలేదు". అలాగే అందరికి ఒకే రకమైన పరీక్షలు, అన్నింటిలోనూ ఉత్తీర్ణులైతేనే పై చదువులకు పంపాలి అనడం ఎంత వరకు న్యాయం?? తెలుగు భాషలో వంద మార్కులు సంపాదించ గలిగిన ప్రఘ్న కలిగి తెలుగులో పి.హెచ్.డి చేద్దామన్న ఆకాంక్షతో ఉన్న ఒక విద్యార్దిని హిందీలో ఉత్తీర్ణుడు కాలేదని పై చదువులకు పంపకపోవడం సమంజసమా??
శిక్ష:
--మార్కులే లక్ష్యంగా, బాంధవ్యాలకు దూరంగా, కమ్మని ప్రకృతికి దూరంగా, కారాగార సదృశమైన నాలుగు గోడల మద్య పుస్తకమే లోకంగా భావించేట్టు చేసి అందిస్తున్న విద్య ఈ విద్యార్దులకు ఒక శిక్ష.
--రక్తాశృవులు పారిస్తూ, అహో రాతృలు కష్టపడినా ఈ కార్పరేటు స్కూల్లల్లో తమ పిల్లలకు ABCDలు నేర్పించుకో లేకపోవటం ఆ తల్లిదండ్రులకో శిక్ష.
--ఇటువంటి శిక్షణతో కూలిపోయే భవంతులు కట్టే ఇంజినీర్లను, ప్రాణాలు తీసే డాక్టర్లను, దన వ్యామోహంతో ధర్మాన్ని తప్పి క్రమశిక్షణారహితంగా ఉండే ఉద్యోగులను, తయారుచేసే కళాశాలల పేరిట ఉన్న వర్తక కార్మాగారాలు మన దేశానికే చీడ పురుగులు.
"నేడు విద్యారంగాలని మించిన వ్యాపారం మరోటి లేదు." ఈ ఉద్దేశంతో మొదలైన కళాశాలలన్ని ఉక్కు కార్మాగారాలు. విద్యార్దులనే ఉక్కుని, తల్లిదండ్రుల కష్టాన్నే కొలిమిగా మలచి, ఒత్తిడి,పోటీతత్వాలనే నిప్పుగా మార్చి ఆ ఉక్కుతో వ్యాపారం చేసే ఉక్కు కార్మాగారాలు ఈ కళాశాలలు.
అన్ని కళాశాలలు ఈ విదంగానే ఉన్నాయనేది నా అభిప్రాయం కాదు. కాని చాలా వరకు ఇలానే ఉన్నాయనేది నా అభిప్రాయం. ABCDలు నేర్పించే నర్సరీకి లక్ష రూపాయలు డొనేషన్, సంవత్సరం మొత్తం కష్టపడి రాంకు సంపాదించి సీటుకి అర్హత పొందినా, తుది నిమిషంలో అర్హతలేని విద్యార్ది అదే సీటుకి 10 లక్షలు చల్లిస్తే సరి. ఇలా ఉన్న విద్యారంగాలతో మన సమాజం ఏ అగాదంలోకి కూరుకుపోతుందో ఇక వేచి చూడాల్సిందే....