Wednesday, June 26, 2013

ఓ పిచుక....!


స్వార్దరహిత మనుష్య జీవితంతో ముడి వేసుకొని, దాగిన స్వార్దపూరిత కోరలను ఆనాడు కానక, నేడు ఆ కొరల జ్వాలాగ్నిలో మాడిపోతున్న తన జాతిని చూచి అనాదగా మిగిలిన ఓ పిచుక, ఆవేదనతో...

చిరు గూటిలో నా జీవనం,
కిలకిలరావాలతో ప్రతి దినం,
ఆకాశ వీధిలో నా విహారం,
ఆనంద సాగరంలో నే విలీనం.

చిట్టి కొమ్మల నా గూడు,
పూరింటి కప్పులో నా గోడు,
పచ్చిక బయళ్ళే నాకు తోడు,
స్వర్గమయమే నాకీ తోడు.

కీటక సంహారం నా భోజనం,
రైతుకు సాయం నా వ్యాపకం,
రాలిన గింజలే నా విందు భోజనం,
రైతు నాపై చూపే మమకారం.

ఇలా సాగిపోతున్న పయనంలో...

సాంకేతికత పేరుతో ఓ పెనుభూతం,
రేపింది నా జీవితంలో ఓ కలకలం,
స్వార్దపు కొరలు చాచిన ఆ సర్పం,
విషాద చాయకు వేసిందో భీజం.

గూడు చిక్కని మహా నగరం,
తరంగాల వలయంలో పోరాటం,
రసాయనాల పేరిట హలాహలం,
మెతుకులకు కరవైన జీవనమో భారం.

రాలిపోతున్న సహచరులు,
కూలిపోతున్న గూటికొమ్మలు,
చూడలేవీ కనుబొమ్మలు,
ఆపలేనీ దురాగతాలు.

మేలు మరచిన రైతు రసాయణాలతో కాటేస్తే, జాలి మరచిన నగరం గూళ్ళను కాలరాస్తే, కనికరము లేక, తోటి జీవులమన్న దయ లేక, స్వార్దము చేత నన్ను ఒంటరిని చేశావు, ఇది నీకు భావ్యమా...???
--శంకర్

1 comment: