శివపురాణం అహాన్ని నాశనం చేయడానికి, ద్యానాన్ని భోదించటానికి తగిన ప్రతీతాత్మకమైన కథల సంపుటం అని ఓ నానుడి. మరి అందులో గంగావతరణం మనసుకి అన్వయించుకున్నప్పుడు ఇలా గోచరించింది.
సగర కుమారుల ఆత్మ విముక్తికై భగీరథుడు చేసిన ప్రయత్నం. ఇది గంగావతరనానికి నాంది.
భగీరథుడు తన మరియు తన పూర్వీకుల ఆత్మ విముక్తికై విలయ తాండవం చేసే కెరటాలతో, అంతులేని లోతులకు మింగేసే సుడిగుండాలతో నిండి ఉన్న గంగను భువికి రమ్మని ప్రార్దించాడు.
పూర్వీకులు పూర్వం చేసిన కర్మలకు నిదర్శనమైతే, ఆ పూర్వ కర్మల చేత ఉద్భవించిన తలపులు కెరటాలైన, ఆ భూత భవిష్యత్ తలంపుల సుడిగుండంలో మానవుడు వర్తమానము మరియు తన నిజ స్వరూపము నుండి విడువడి బ్రతుకు సారిస్తూ ఉంటాడు. ఇటు వంటి అరిషడ్వర్గాలతో కూడిన ఆలోచనల గుండంలో సతమతమవుతూ వాటి నుండి విముక్తి పొందటానికి, తనను తాను తెలుసుకొవటానికి ప్రయత్నము సలుపడు.
భగీరథుడు ఇంతటి ఊగ్రరూపాన ఉన్న గంగను శాంతింపచేసి భువికి దింపగల దిట్టయైన శివునికై తపము చేసి శివుని సాక్షాత్కరింప చేసుకున్నాడు.
నా ఆలోచన సరలిలో, ద్యానములో, తపములో నిమఘ్నుడైన వాడు ఆలొచనల కడలికి అతీతంగా తానే శివుడై నిశ్చలంగా, శాంతియుతంగా కేవలం దర్శనమాత్రుడై తనకు ఖేదం కలగక నిర్ణయము తీసుకొను ధీశాలిగా మారగలడు.
శివుడు తన జటాజూటాన ఆ నిలకడ యెరుగని గంగను బందించి సౌమ్య రీతిన, పాపాలను హరించు పాపనాసినిగా దివిపైకి చేర్చాడు. ఆ పిమ్మట గంగ తన స్పర్శతో సకల సగర వంశమునకు ముక్తిని ప్రసాదించింది.
తాను ద్యానము చేత నిలకడ లేని ఆలోచనలకు పగ్గం వేసి శాంతంగా సరైన నిర్ణయం తీసుకొనగలుగుతాడు. అటువంటి నిర్ణయాల చేత తాను తన పరివారానికి సంతోషదాయకంగా మారగలడు.
నేను నాకు అర్దమైన, నచ్చిన రీతిన కథలను అన్వయించుకున్నాను. మీరు ఈ కథను ఏ రీతిలో చూసారో మీరూ చెప్పగలరు.









