Sunday, June 9, 2013

కాగితం.

కాగితపు జీవితం,
కాలానికి అంకితం,
కోటి భావాల నిక్షిప్త సంపుటం,
కాల చరిత్రకు మిగిలిన సాక్ష్యం.

ప్రియుడే ఎదురుగా నిలిచినా,
పెదవే పలుకులు లేక మూగబోయినా,
ప్రేమ పుష్పించుటకు సాయంగా నిలిచిందో కాగితం.

కాల చక్ర వలయంలో పడి
దూరమైన మిత్ర మండలిలో,
స్నేహాన్ని చిగురించి కలిపిందో కాగితం.

మనో వేదిత ప్రపంచంలో
ఒంటరిగా నిలిచిన బ్రతుకుకు,
నేనున్నానంటూ ఆసరాగా నిలిచిందో కాగితం.

అనుభవాల భాండాగారం,
జ్ఞాన సంపదకు నిలవలు మన చరిత్ర పుటలు,
ఆ చరిత్రను హ్రుదయంలో దాచుకొని కాపాడిందో కాగితం.

కదలిక లేని కాగితం - పలికించగలదు కోటి రాగాల గీతం.
మాట లేని కాగితం - చూపించగలదు మహామహుల మనోగతం.

చులకన చేయకురా ఓ నేస్తం, ఈ కాగితమే కాగలదు
 మన జీవన చక్రపు మలపుటద్దం.

--(శంకర్)

No comments:

Post a Comment